📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల కళాశాల మైదానంలో చీకట్లు: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనంపై స్థానికుల ఆగ్రహం

పోరుమామిళ్ల కళాశాల మైదానంలో చీకట్లు: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనంపై స్థానికుల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,సెప్టెంబర్ 15:ప్రజావాణి కడప జిల్లాలోనే అతిపెద్ద మైదానాలలో ఒకటిగా పేరుగాంచిన స్థానిక పోరుమామిళ్ల ప్రభుత్వ కళాశాల మైదానం ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది.ఒకప్పుడు క్రీడాకారులు,స్థానికులతో కళకళలాడిన ఈ మైదానం.నేడు చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం -అంధకారంలో మైదానం
సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఈ మైదానం పూర్తి అంధకారంలోకి వెళ్ళిపోయిందని ప్రజలు చెబుతున్నారు.గతంలో సర్పంచులు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్ దీపాలు వేయించడం, మైదానాన్ని పర్యవేక్షించడం చేసేవారని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం అధికారుల పాలనలో ఈ మైదానాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా “చేద్దాం.చూద్దాం.” అంటూ కాలయాపన చేయడం మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యువత, వృద్ధులకు తప్పని ఇబ్బందులు
ఈ మైదానానికి ప్రతిరోజు ఉదయం,సాయంత్రం వందలాది మంది యువతీ యువకులు వాకింగ్, రన్నింగ్, వ్యాయామం మరియు వివిధ ఆటల కోసమని వస్తుంటారు.అలాగే దాతలు ఏర్పాటు చేసిన బల్లలపై వృద్ధులు సాయంత్రం వేళల్లో కూర్చొని సేద తీరుతుంటారు. అయితే రాత్రి వేళల్లో సరైన లైటింగ్ లేకపోవడంతో,దట్టమైన పొదలు ఉండటం వల్ల విషపురుగులు,పాముల భయం పెరిగిపోయింది.చీకటిలో వాకింగ్ చేసే వారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మద్యం బాబుల హల్చల్ – భయాందోళనలో క్రీడాకారులు
రాత్రి వేళల్లో మైదానం చీకటిగా మారడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు,మద్యం బాబులు ఇక్కడ యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.మైదానంలో అక్కడక్కడ మద్యం సేవించి,ఆ సీసాలను ఇష్టానుసారంగా పగలగొట్టి వెళ్తున్నారు.దీనివల్ల ఉదయాన్నే ఆటలు ఆడుకోవడానికి వచ్చే విద్యార్థులు,క్రీడాకారుల కాళ్లకు ఈ గాజు పెంకులు గుచ్చుకుని గాయాలవుతున్నాయి.ఆట స్థలం కాస్తా మద్యం బాబుల అడ్డాగా మారడంతో క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా స్పందిస్తారా?ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,కళాశాల మైదానంలో తక్షణమే హైమాస్ట్ లైట్లను పునరుద్ధరించాలని,అలాగే మైదానంలో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా పోలీసు గస్తీ పెంచాలని స్థానికులు,విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని,మైదానాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.