*ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం*
*విద్యతోనే మనిషికి సంస్కారం.. ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి: మున్సిపల్ చైర్మన్*
మేడ్చల్ (నేడు న్యూస్):- ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని రైతు వేదికలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. విద్య వల్ల మనిషికి జ్ఞానంతో పాటు సంస్కారం కూడా వస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత పై అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి తహసీల్దార్ గులాం ఇద్రీష్, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, ఎంఈవో భాగ్యమణి, పీఆర్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, సుబ్బారావు, శ్రీనివాస్, ప్రభాకర్, సంధ్య, రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

