బీరంగూడ కమాన్ వద్ద బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!
లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం
డ్రైవర్‌కు తీవ్రగాయాలు
ప్రయాణికులు లేక తప్పిన పెను ప్రమాదం
రామచంద్రపురం, నవంబర్ 11 (ప్రజావాణి): రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సల్మాన్ (30) తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రామచంద్రపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బోల్తాపడిన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. బస్సు అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది.

