📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి :- ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి :- ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం

📰 Generate e-Paper Clip

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐటీయూ యూనియన్ నాయకుడు నరేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ప్రజలకు కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు వైద్య సేవలు అందించడం, తల్లి–బిడ్డల ఆరోగ్య సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ వంటి అనేక ముఖ్యమైన బాధ్యతలను ఆశా వర్కర్లు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో సైతం ప్రాణాలను పణంగా పెట్టి ఆశా వర్కర్లు ప్రజలకు సేవలందించారని, వారి సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. ఇంతటి కీలక సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ఇప్పటికీ కనీస వేతనం, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆశా వర్కర్లకు కేవలం రూ.9,900 మాత్రమే పారితోషికంగా చెల్లిస్తున్నారని, గత ఐదేళ్లుగా పారితోషికాలు పెంచకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం 2023లో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు నిరవధిక సమ్మె నిర్వహించడంతో పాటు, 2024లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలు చేపట్టామని గుర్తు చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి సమ్మె చేపడతామని యూనియన్ నాయకులు వెల్లడించారు.

ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు ఇవే:

* నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.
* రూ.50 లక్షల బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులను వెంటనే అమలు చేయాలి.
* రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.5 లక్షలు చెల్లించడంతో పాటు పారితోషికంలో సగం పెన్షన్‌గా నిర్ణయించాలి.
* ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులతో పాటు సంవత్సరానికి 20 రోజుల క్యాజువల్ సెలవులు, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు, ప్రసూతి సెలవులు కల్పించాలి.
ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. రెండో పీఆర్‌సీలో ఆశా వర్కర్లకు రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలి. ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు పద్మ, వసంత, మమత, సునీత, మంజుల, యాదమ్మ, అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.