*నేరస్తులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన కృషి.. 102 కేసుల్లో శిక్షలు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేత* ..
*6 కేసుల్లో జీవిత ఖైదు…మరో 8 కేసుల్లో 10 నుంచి 31 సంవత్సరాల వరకు జైలు శిక్షలు* ..
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, శిక్షల శాతం పెంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (CDOs), పబ్లిక్ ప్రాసిక్యూటర్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంస పత్రాలు, మెమెంటోలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కృషితో మొత్తం 102 కేసుల్లో నిందితులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడగా, 6 కేసుల్లో జీవిత ఖైదు, మరో 8 కేసుల్లో 10 నుంచి 31 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించబడ్డాయని తెలిపారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా పనిచేయడం జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేసుల దర్యాప్తు నుంచి న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నేరాలకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి, సాక్షుల వాంగ్మూలాలు, కీలక ఆధారాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టాలని తెలిపారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా కేసులను బలోపేతం చేసి, నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా కృషి చేయాలని ఆదేశించారు. శిక్షల శాతం పెంపులో విశేష కృషి చేసిన అధికారులను అభినందించిన ఎస్పీ, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ విధులు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్షలు పడేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె. శివ రాం రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఎస్బీ సీఐ నాగరాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, సీఐలు క్రాంతికుమార్, రంజిత్ రెడ్డి, ఎస్‌ఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అఖిల, శోభా రాణి, రంజిత్ కుమార్, కోర్టు డ్యూటీ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


