పోరుమామిళ్ళ (కడప జిల్లా) నవంబర్ 2 ప్రజావాణి దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా “సుస్థిర జీవనశైలి వారోత్సవాలు”-2026ను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా రెండవ రోజు సోమవారం పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి శ్రీ రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ,ఇంధన పొదుపుపై ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.
ఒక గంట పాటు విద్యుత్ నిలిపివేత (స్విచ్ ఆఫ్):
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో విద్యుత్ పొదుపు ఎంతటి కీలకమైనదో ప్రాక్టికల్‌గా నిరూపిస్తూ, పోరుమామిళ్ళ రేంజ్ కార్యాలయంలో అధికారులు ఒక గంట పాటు విద్యుత్ పరికరాలను పూర్తిగా నిలిపివేశారు (స్విచ్ ఆఫ్).రేంజ్ అధికారి రఘునాథ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది అంతా ఈ స్వచ్ఛంద ఇంధన పొదుపు చర్యలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను బాధ్యతాయుతంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.భాగ్యలక్ష్మి హైస్కూల్లో అవగాహన సదస్సు సుస్థిర జీవనశైలి ప్రతిజ్ఞ: కార్యాలయంలో కార్యక్రమం అనంతరం, పోరుమామిళ్ళలోని స్థానిక భాగ్యలక్ష్మి హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఫారెస్ట్ అధికారులు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, రోజువారీ జీవితంలో విద్యుత్ మరియు నీటిని ఎలా పొదుపు చేయాలో శాస్త్రీయంగా, సులభమైన పద్ధతుల్లో వివరించారు. భావితరాల మనుగడకు ప్రకృతి వనరులను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. అనంతరం, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందంతో కలిసి అటవీ శాఖ అధికారులు “సుస్థిర జీవనశైలి ప్రతిజ్ఞ” చేయించారు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా తమ జీవనశైలిని మార్చుకుంటామని విద్యార్థులు ఈ సందర్భంగా దృఢ సంకల్పం చేశారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ సుబ్బారెడ్డి గారు విచ్చేశారు. అలాగే భాగ్యలక్ష్మి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెడ్మాస్టర్) శ్రీ రవిశంకర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం చొరవ తీసుకుని విద్యార్థులను భాగస్వాములను చేశారు. అటవీ శాఖ తరపున ఫారెస్ట్ సెక్షన్ అధికారులు శ్రీ రమణయ్య, శ్రీ జి.వి.రమణలతో పాటు బీట్ అధికారులు కరుణాకర్, నారాయణ స్వామి, హాసన్ భాష,భారతి,కిషోర్,వెంకటేష్,ప్రతాప్ మరియు ప్రొటెక్షన్ వాచర్లు,సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ పిలుపు మేరకు జరిగిన ఈ వారోత్సవాలు స్థానికంగా పర్యావరణ చైతన్యాన్ని రగిల్చాయి.

