సాహసానికి సెల్యూట్ ధైర్యానికి జోహార్లు
లక్ష్మి… నీ ధైర్యం వేలాది మంది బాలికలకు స్ఫూర్తి!
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 రాప్తాడు, అనంతపురం జిల్లా
ఒకవైపు రంపం మిషన్ చేతబట్టి తోటి విద్యార్థినిపై దాడికి తెగబడిన వ్యక్తి… మరోవైపు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా, తోటి విద్యార్థినిని రక్షించేందుకు ముందుకొచ్చిన చిన్నారి లక్ష్మి!
దాడి జరిగిన తర్వాత ఉక్కుపాదంతో అణిచివేస్తాం, తాట తీస్తాం అంటూ ప్రకటనలు చేసే నాయకులు చాలామంది ఉంటారు. కానీ ప్రమాదం కళ్లముందు ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఎదురు నిలబడే ధైర్యం అందరిలో ఉండదు.
లక్ష్మి చూపించింది కేవలం ధైర్యం మాత్రమే కాదు… తోటి మనిషి ప్రాణం పట్ల తనకున్న బాధ్యతను, మానవత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని!
మా డిమాండ్:
1. రాప్తాడు ఘటనలో తోటి విద్యార్థినిని రక్షించేందుకు సాహసం ప్రదర్శించిన బాలిక లక్ష్మికి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి పురస్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి.
2. ఆమె సాహసాన్ని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించాలి.
3. లక్ష్మి వైద్య ఖర్చులను ప్రభుత్వం పూర్తిగా భరించి, ఆమె సంపూర్ణంగా కోలుకునే వరకు అవసరమైన వైద్య సహాయం అందించాలి.
4. ఆమె విద్యాభవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి.
ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి:
సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సమాజంలో ఉన్న మానవ సంపదను కాపాడటం అంతకంటే ముఖ్యం. మన ఆడపిల్లలు ఈ సమాజానికి సంపద. వారి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తు ప్రభుత్వాల ప్రథమ బాధ్యత కావాలి.
లక్ష్మి లాంటి బాలికల సాహసాన్ని గుర్తించి గౌరవించినప్పుడే సమాజంలో మానవత్వానికి విలువ పెరుగుతుంది.
లక్ష్మి… నీవు త్వరగా కోలుకోవాలి. నీ ధైర్యం మరెంతోమంది బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి.
నీ సాహసానికి మా హృదయపూర్వక సెల్యూట్!

