సీతమ్మలోద్ది చారిత్రక సంపదను భావితరాలకు అందించాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 02
560 మందికి పైగా ట్రెక్కర్లు, చిన్నారుల భాగస్వామ్యంతో హెరిటేజ్ ట్రెక్కింగ్ విజయవంతం
10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రైండింగ్ పరికరం కలెక్టరేట్ పురావస్తు మ్యూజియంలో భద్రపేతం
పెద్దపల్లి, నవంబర్ 2: సీతమ్మలోద్ది చారిత్రక ప్రాంత విశిష్టతను భావితరాలకు అందించడంతో పాటు, అక్కడి చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. సీతమ్మలోద్ది ప్రాంతంలో నిర్వహించిన హెరిటేజ్ ట్రెక్కింగ్ కార్యక్రమంలో 560 మందికి పైగా ట్రెక్కర్లు, చిన్నారులు పాల్గొని విజయవంతం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పురావస్తు మ్యూజియంలో ప్రాచీన గ్రైండింగ్ పరికరం
సీతమ్మలోద్ది గుహలో లభించిన సుమారు 10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రైండింగ్ పరికరం (సద్దలే క్యూర్న్ )ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చేతుల మీదుగా పెద్దపల్లి కలెక్టరేట్‌లోని పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు.
ఈ సందర్భంగా డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ప్రాచీన గ్రైండింగ్ పరికరం ప్రత్యేకత, వినియోగం గురించి కలెక్టర్‌కు వివరించారు.
ప్రాచీన మానవులు ధాన్యాలు, మొక్కల భాగాలు, వేర్లు, ఖనిజ వర్ణద్రవ్యాలను నూరి పొడి చేసుకోవడానికి శాడిల్ క్వెర్న్ అనే పరికరాన్ని ఉపయోగించేవారని తెలిపారు. ఒక పెద్ద రాయిపై చిన్న రాయిని ముందుకు వెనుకకు రుద్దుతూ పదార్థాలను మెత్తటి పొడిగా చేసుకునేవారని వివరించారు.
సీతమ్మలోద్ది గుహలో ఇలాంటి గ్రైండింగ్ రాళ్లు లభించడం ఆ ప్రాంతంలో ప్రాచీన మానవుల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కళా సంప్రదాయాలు, అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విలువైన ఆధారాలను అందిస్తోందని పేర్కొన్నారు.
చారిత్రక విశేషాలతో హెరిటేజ్ టేబుల్ బుక్
సీతమ్మలోద్ది చారిత్రక విశేషాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన హెరిటేజ్ టేబుల్ బుక్ ప్రచురణకు కృషి చేసిన బృందాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
చారిత్రక ప్రదేశాల విశిష్టత, పురాతన మానవుల జీవన విధానానికి సంబంధించిన ఆధారాలను పుస్తక రూపంలో భద్రపరచడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, హెరిటేజ్ టేబుల్ బుక్ రూపకల్పనలో కృషి చేసిన అనిల్‌ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
పర్యాటక అభివృద్ధికి హెరిటేజ్ ట్రెక్కింగ్ దోహదం
చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు పర్యాటక అభివృద్ధికి ప్రోత్సాహం అందించడం, భావితరాల్లో చరిత్ర పట్ల అవగాహన పెంపొందించడం వంటి లక్ష్యాల సాధనలో హెరిటేజ్ ట్రెక్కింగ్ కార్యక్రమం ఒక మంచి ముందడుగుగా నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు.
సీతమ్మలోద్ది వంటి చారిత్రక ప్రదేశాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా వాటి పరిరక్షణకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు.

