*వీబీజీ రామ్ జీ కార్యాలయంలో అరకొర వసతులు – అధికారుల నిర్లక్ష్యం*
*రాయికల్, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):*
పేదలకు ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన కార్యాలయమే నేడు ప్రమాదాలకు నిలయంగా మారింది. రాయికల్ పట్టణంలోని వీబీజీ రామ్ జీ కార్యాలయ దుస్థితి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. నిధులు లేక, పట్టించుకునే నాథుడు లేక భవనం పూర్తిగా అద్వాన్న స్థితికి మారింది.
*విరిగిన తలుపులు.. జారుడు మెట్లు:*
కార్యాలయ ప్రధాన ద్వారం, గదుల తలుపులు విరిగిపోయి వేలాడుతున్నాయి. పై అంతస్తుకు వెళ్లే మెట్లపై కప్పిన ఇనుప రేకులు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో వర్షం నీరు నేరుగా మెట్లపై పడి పాకురు, నాచు పట్టి మెట్లు జారుడుగా మారాయి. పై అంతస్తులోని కార్యాలయానికి వెళ్లాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బంది వాపోతున్నారు.
*పాములు, తేళ్లకు అడ్డా:*
భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఆవరణమంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో ఆ ప్రాంతం పాములు,తేళ్లకు నిలయంగా మారింది. కార్యాలయ ఆవరణలోకి అడుగు పెట్టాలంటేనే మహిళా సిబ్బంది భయంతో వణికిపోతున్నారు.
*ఒకే భవనంలో వివక్ష:*
ఇదే భవన సముదాయంలో ఐకేపీ, వీబీజీ రామ్ జీ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఐకేపీ గదులకు, తలుపులకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు,పైన ఉన్న వీబీజీ రామ్ జీ కార్యాలయాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారు.ఒకే భవనంలో ఒక వైపు కొత్త కళతో, మరో వైపు పాడుబడిన బంగ్లాలా కనిపిస్తుండటం అధికారుల వివక్షకు పరాకాష్ట అని పలువురు చర్చించుకుంటున్నారు.లక్షలాది రూపాయల ఉపాధి హామీ లెక్కలు, కీలక రికార్డులు, కంప్యూటర్లు ఈ అభద్రత కలిగిన భవనంలోనే ఉన్నాయి. గదుల తలుపులు కూడా సరిగా లేకపోవడంతో రికార్డులు,కంప్యూటర్ల పై వర్షపు నీరు పడి చెడిపోయే ప్రమాదం ఉందని, కంప్యూటర్లు కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శిథిలమైన వీబీజీ రామ్ జీ కార్యాలయానికి మరమ్మతులు చేయించి, ప్రహరీ గోడ నిర్మించి కనీస వసతులు కల్పించాలని సిబ్బంది,ప్రజలు కోరుతున్నారు.

