సీజ్ చేసిన సాక్షి హాస్పిటల్ మళ్లీ ఓపెన్
!
అనుమతులు లేకుండానే తలుపులు తెరిచారు
అధికారుల విచారణతో మరోసారి సీజ్.. గడువు ముగిసిన మందుల వినియోగంపై గుర్తింపు
మేడ్చల్, సెప్టెంబర్ 14:
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారనే కారణంతో అధికారులు సీజ్ చేసిన సాక్షి హాస్పిటల్‌ను మళ్లీ తెరిచిన ఘటన మేడ్చల్‌లో కలకలం రేపింది. సీజ్ చేసిన ఆసుపత్రిని అధికారుల అనుమతి లేకుండానే తిరిగి ప్రారంభించినట్లు సమాచారం అందడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఇటీవల అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు గుర్తించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆనంద్ సాక్షి హాస్పిటల్‌ను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన అనంతరం కూడా ఆసుపత్రిని తిరిగి తెరిచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు ఆసుపత్రిని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించి మరోసారి సీజ్ చేసినట్లు తెలిసింది.
గడువు ముగిసిన మందుల వినియోగం?
ఆసుపత్రి తనిఖీల సందర్భంగా మరో అంశం అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. గడువు ముగిసిన టాబ్లెట్లు/మందులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీనిపై కూడా వైద్యారోగ్య శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న వైద్య సేవల విషయంలో నిబంధనలు పాటించాల్సి ఉండగా, సీజ్ చేసిన ఆసుపత్రిని అనుమతులు లేకుండా తిరిగి తెరవడం పట్ల డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆనంద్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.సీజ్ చేసిన తర్వాత కూడా ఆసుపత్రి ఎలా తిరిగి తెరుచుకుంది? ఎవరి అనుమతితో కార్యకలాపాలు ప్రారంభించారు? గడువు ముగిసిన మందులు నిజంగానే వినియోగించారా? అనే అంశాలపై అధికారులు మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

