మట్టి గణేశుడితో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘గ్రీన్ గణేశా’ అవగాహన కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్, ఈసీఐఎల్ (శిల్పానగర్) విద్యార్థుల ఆధ్వర్యంలో ‘గ్రీన్ గణేశా’ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీ, ఎస్ఎంహెచ్ కాలనీ, పీఎంఆర్ కాలనీ, ఉషోదయ కాలనీల వాసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అంటూ నినాదాలు చేస్తూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై అవగాహన కల్పించారు.
బుర్రకథతో ఆకట్టుకున్న విద్యార్థులు
గణేష్ ఉత్సవాల చరిత్ర, సంప్రదాయాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినోదంతో పాటు పర్యావరణ సందేశాన్ని అందించిన విద్యార్థుల ప్రదర్శనను కాలనీవాసులు అభినందించారు.అనంతరం పాఠశాల విద్యార్థులు అందించిన మట్టితో వినాయక విగ్రహాల తయారీలో కాలనీవాసులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ చేతులతో పర్యావరణహిత గణేశ విగ్రహాలను తయారు చేసుకుని పండుగను ప్రకృతికి అనుకూలంగా జరుపుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
మట్టి గణేశ విగ్రహాల పంపిణీ
విగ్రహాల తయారీలో ప్రతిభ కనబరిచిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. పార్వతీదేవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం కాలనీవాసులతో మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ముగింపులో కాలనీవాసులకు మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి. పార్వతీదేవి మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సూచించారు. చిన్నారుల్లో చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.
కార్యక్రమంలో ఆయా కాలనీల నాయకులు, కాలనీ అధ్యక్షులు బిక్షపతి, కృష్ణారెడ్డి, సాయి యాదవ్, సందీప్ సన్నీ, రామకృష్ణ, కాలనీవాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విజ్ఞాన్ స్కూల్స్ మార్కెటింగ్ హెడ్ అనిల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

