స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయం
తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజు: కాంగ్రెస్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్, కౌడే మహేష్ కురుమ
మేడ్చల్: గౌరవ శాసనసభ స్పీకర్‌పై శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన శాసనసభ గౌరవానికి, తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉందని వారు పేర్కొన్నారు. స్పీకర్‌పై మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను సైతం అవమానించేలా మాట్లాడటం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ అన్నారు. ఇది ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి జరిగిన అవమానం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా భావించాలని పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలో ఇలాంటి భాషను ఉపయోగించడం అత్యంత తీవ్రమైన విషయమని, ఇలాంటి ఘటనలు చట్టసభల గౌరవాన్ని దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై శాసనమండలి చైర్మన్ తగిన చర్యలు తీసుకుని, బాధ్యుడైన సభ్యుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా చట్టసభలోని ప్రతి సభ్యుడు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని మహేష్ కురుమ అన్నారు. అడ్డగోలుగా, అభ్యంతరకరంగా మాట్లాడినా చెల్లుతుందనే భావనకు అడ్డుకట్ట వేయాలని, ఇలాంటి దుర్మార్గపు పోకడలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఇలాంటి ఘటనలను క్షమించి వదిలేస్తే భవిష్యత్తులో చట్టసభల పట్ల గౌరవం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. శాసనసభ గౌరవాన్ని కాపాడేందుకు సంబంధిత సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకుని సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు కే. చంద్రశేఖర్ రావు సభకు క్షమాపణ చెప్పాలని వారు కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలకు, కుటుంబ సభ్యులను అవమానించే వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు. శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేవనెత్తిన అంశంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, స్పీకర్‌పై దుర్భాషలాడిన సభ్యుడిపై అనర్హత వంటి కఠిన చర్యల అవసరాన్ని ప్రస్తావించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ ఘటనపై సభా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. చట్టసభ గౌరవం కాపాడటం ప్రతి సభ్యుడి బాధ్యత. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత అవమానాలకు తావివ్వకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి” అని వారు పేర్కొన్నారు.

