📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడినోవాలో 6.2 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు

మేడినోవాలో 6.2 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు

📰 Generate e-Paper Clip

మేడినోవాలో 6.2 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు

58 ఏళ్ల మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం

మేడ్చల్: మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు 58 ఏళ్ల మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 6.2 కిలోల బరువున్న భారీ అండాశయ కణితిని విజయవంతంగా తొలగించారు. మెదక్ జిల్లా గంధార పల్లికి చెందిన మహిళ గత మూడు నెలలుగా కడుపు ఉబ్బరం, అజీర్ణంతో బాధపడుతూ వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వహించగా పొత్తికడుపులో సుమారు 32×30 సెం.మీ. పరిమాణంలో భారీ అండాశయ కణితి ఉన్నట్లు గుర్తించారు. కణితి పొత్తికడుపు నుంచి పైభాగం వరకు విస్తరించడంతో పాటు పరిసర అవయవాలకు అంటుకుని ఉండటంతో శస్త్రచికిత్స సవాలుగా మారింది.
అదే సమయంలో రోగికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు కూడా గుర్తించారు. కార్డియాలజీ నిపుణుల పరీక్షల్లో మైల్డ్ డయాస్టాలిక్ డిస్‌ఫంక్షన్, మైల్డ్ పల్మనరీ హైపర్‌టెన్షన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్సకు ముందు ప్రత్యేక వైద్య జాగ్రత్తలు తీసుకున్నారు. కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డా. సోనియా రెడ్డి, జనరల్ సర్జన్ డా. మనోజ్ కుమార్, అనస్థీషియా వైద్యులు డా. మాధవ్ రెడ్డి, డా. శిరీషతో పాటు ఇతర వైద్య సిబ్బంది సమన్వయంతో ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ నిర్వహించారు. శస్త్రచికిత్సలో సుమారు 6.2 కిలోల బరువున్న సీరస్ సిస్టాడెనోమా కణితిని విజయవంతంగా తొలగించారు. కణితి గర్భాశయం, సిగ్మాయిడ్ కోలన్, రెక్టమ్ తదితర పరిసర నిర్మాణాలకు అంటుకుని ఉండటంతో వైద్యులు అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. అనంతరం రోగి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, కణితి భారీ పరిమాణంలో ఉండటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ గైనకాలజీ, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, అనస్థీషియా విభాగాల సమన్వయంతో చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో జాగ్రత్తగా చికిత్స అందించిన వైద్య బృందానికి రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్‌లో మెడినోవా హాస్పిటల్‌లో ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.