📄 ePaper
Monday, July 20, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఅందెశ్రీ స్మృతి సభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

అందెశ్రీ స్మృతి సభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ స్మారక సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందెశ్రీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేసిన ముఖ్యమంత్రి, అందెశ్రీ రచనల 20 వేల ప్రతులను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చమకూర మల్లారెడ్డి, కుంభం అనిల్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, పట్నం మహేందర్ రెడ్డి, బల్మూరి వెంకట్, మల్లు రవి, బీర్ల ఐలయ్య, కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందెశ్రీ తనకు ఆత్మబంధువులాంటి వ్యక్తి అని, ఆయన మరణం వ్యక్తిగతంగా తీవ్ర వేదన కలిగించిందని అన్నారు. తాపీ మేస్త్రీగా జీవితాన్ని ప్రారంభించి, తన కలంతో తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహాకవి అందెశ్రీ అని కొనియాడారు.

“జయ జయహే తెలంగాణ” గీతంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో ఉద్యమ స్పూర్తిని రగిలించారని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు, ఆకలి బాధలు ఎదురైనా ఆత్మగౌరవాన్ని విడిచిపెట్టని వ్యక్తి అందెశ్రీ అని తెలిపారు.

ఉద్యమ కవులు అందెశ్రీ, గద్దర్‌లకు గత ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించిన ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తోందని చెప్పారు. ఇప్పటికే పలువురు ఉద్యమ నాయకులకు వివిధ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా సీఎం విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, తమ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. రైతులు, పేదల సంక్షేమం కోసం రేషన్ కార్డులు, పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

“అందెశ్రీ మళ్లీ పుడతారు.. గద్దర్ మళ్లీ పుడతారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల ఆత్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular