ఘట్‌కేసర్, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్‌కేసర్ మండల బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల బీజేపీ అధ్యక్షుడు బస్వ రాజు గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఘట్‌కేసర్‌లో గత 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, శిథిలావస్థకు చేరిన గురుకుల విద్యాలయ భవనాన్ని పునరుద్ధరించాలని కోరారు.
మండల అధ్యక్షుడు బస్వ రాజు గౌడ్ మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని, లేకపోతే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కువకాలం కొనసాగించలేరని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గుండ్ల బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శులు పోలు భాస్కర్ గౌడ్, గోబిరి మన్యం, జిల్లా కో-కన్వీనర్ బండిరాల సాయిరాం, మేకల శంకర్ ముదిరాజ్, కనకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




