📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

365 ఒత్తులు, కోటి ఒత్తుల దీపోత్సవంతో భక్తుల ప్రత్యేక దీపారాధన

నస్రుల్లాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): నస్రుల్లాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇళ్ల వద్ద ఉన్న తులసి కోటల దగ్గర 365 ఒత్తులు, కోటి ఒత్తులతో ప్రత్యేక దీపారాధనలు నిర్వహించారు. ఆలయాలు, ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

కార్తీక పౌర్ణమిని శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర పర్వదినంగా భావిస్తారు. త్రిపురాసుర సంహారానికి గుర్తుగా దేవతలు దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున దీపారాధన చేయడం వల్ల ఏడాది పొడవునా దీపం వెలిగించినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత

కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో, ఇళ్లలో దీపాలు వెలిగించడంతో పాటు దీపదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మహిళలు తులసి కోట వద్ద 365 వత్తులతో దీపారాధన చేస్తారు. సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులు వెలిగించడం ద్వారా ఏడాది పొడవునా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఉసిరికాయపై వత్తి ఉంచి దీపం వెలిగించడం కూడా ఈ పర్వదినంలోని ప్రత్యేక ఆచారాల్లో ఒకటి.

పురాణాల ప్రకారం, పరమశివుడు త్రిపురాసురులను సంహరించిన విజయానికి గుర్తుగా కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఈ పర్వదినం మనిషిలోని అహంకారం, అజ్ఞానాన్ని తొలగించుకుని ధర్మమార్గంలో నడవాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

పవిత్రమైన కార్తీక మాసంలో సోమవారాల ఉపవాసాలు, ఏకాదశులు, పౌర్ణమి వంటి విశేష పర్వదినాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు. ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.