జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: ఈ నెల 27న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జనగామ జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంత్రి పర్యటనలో భాగంగా జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, అత్యవసర వైద్య చికిత్స కేంద్రం (క్రిటికల్ కేర్ బ్లాక్) ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. సుమారు రూ.154 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రవేశ ద్వారం వద్ద శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకు సిద్ధంగా ఉంచాలని, ప్రతి బెడ్, వైద్య పరికరం, ఫర్నిచర్ నిర్దేశిత ప్రదేశాల్లో అమర్చాలని, భవనం, పరిసరాలు పూర్తిస్థాయిలో శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.
వైద్య కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పైలాన్, శిలాఫలకం సిద్ధం చేయాలని, లెక్చర్ హాళ్లు, ప్రయోగశాలల్లో ఫర్నిచర్, పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజిటల్ తరగతి గది ప్రారంభోత్సవానికి అవసరమైన సాంకేతిక సదుపాయాలు కల్పించాలన్నారు.
మంత్రి విద్యార్థులతో సుమారు గంట పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, విద్యార్థిని, విద్యార్థుల వసతి గృహాలను పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు.
సీహెచ్‌సీ వద్ద మంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆసుపత్రికి వెళ్లే మార్గం, పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం లిఖితపూర్వకంగా ఆహ్వానాలు అందించాలన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అంబులెన్స్, వైద్యులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. శంకర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, డీఎంహెచ్ఓ డా. వాణి శ్రీ, డీసీహెచ్ఎస్ డా. సంధ్య, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

