వనంవారి కిష్టాపురంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ
దూడల ఆరోగ్యంపై రైతులకు అవగాహన.
ముదిగొండ, నవంబర్ 2 ప్రజావాణి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు డా. మన్యం రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పశువుల ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూడల్లో నట్టల వల్ల ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటి నష్టాలు కలుగుతాయని వివరించారు. పశువులకు సకాలంలో నట్టల నివారణ మందులు అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పాల ఉత్పత్తి, పశుసంపద అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. రైతులు పశువైద్యుల సూచనల మేరకు మందులను వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది అనిత, త్రివేణి, రోహిత్, రవి, ఇమ్రాన్ ఖాన్, గ్రామ మిత్రులు సుమన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

