*మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా న్యూట్రిషన్ మేళా*
మనోహరాబాద్, సెప్టెంబర్ 19: మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్–టీచర్ మీటింగ్ సందర్భంగా న్యూట్రిషన్ మేళాను ఘనంగా నిర్వహించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆహార పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు తదితర పోషక విలువలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సందర్శకులకు వివరించారు. వివిధ రకాల పోషకాహార పదార్థాలను ఆకర్షణీయంగా ప్రదర్శిస్తూ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు
పి.వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఎంపీడీవో ప్రీతిరెడ్డి, గ్రామ సర్పంచ్ అనుషా భాస్కర్ యాదవ్, ఉపసర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు. అదేవిధంగా పేరెంట్–టీచర్ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, చదువులో పురోగతి, వారి అభ్యసన స్థాయిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం న్యూట్రిషన్ మేళా ప్రధాన ఉద్దేశమని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులు పోషకాహారంపై అవగాహన పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం దోహద పడుతుందని పేర్కొన్నారు.

