ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండానే భూమి ఆన్‌లైన్ మార్పు?
కడప జిల్లా,పోరుమామిళ్ల: సెప్టెంబర్ 21ప్రజావాణి పేదల భూముల విషయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోరుమామిళ్ల మండలం బొప్పాపురం గ్రామంలో 1987లో డీకేటీ పట్టా కింద మంజూరైన భూమికి సంబంధించి ఆన్‌లైన్ రికార్డుల మార్పుపై కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం చివరకు జిల్లా ఉన్నతాధికారుల వద్దకు చేరింది.బాధితుడు చాటకొండ ఆనందరావు ఈరోజు కడప జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో జాయింట్ కలెక్టర్ మేడం కి లిఖితపూర్వకంగా అర్జీ సమర్పించారు. అర్జీని పరిశీలించిన జేసీ విచారించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు.బొప్పాపురం గ్రామంలోని సర్వే నంబర్ 187-1లో 15-08-1987న డీకేటీ పట్టా కింద 1.79 ఎకరాల భూమి తమ తల్లి చాటకొండ జీవమ్మ పేరు మీద మంజూరైందని ఆనందరావు తెలిపారు. తమ తల్లి జీవమ్మకు ముగ్గురు సంతానం ఉన్నారని, తల్లి తర్వాత ఆ భూమిపై ముగ్గురికి సమాన హక్కు ఉంటుందని పేర్కొన్నారు.అయితే తమ కుటుంబంలోని ఒక వ్యక్తి ఎలాంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మిగిలిన వారసుల లేదా ఇతర వారసత్వ ఆధారాలు సమర్పించకుండానే రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయించుకుని ఆన్‌లైన్‌లో భూమిని తన పేరు మీదకు మార్చుకున్నారని ఆయన ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్
సాధారణంగా వారసత్వంగా భూమి మార్పు చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తప్పనిసరి. అంతేకాకుండా విఆర్వో, ఆర్ఐ విచారణ, మిగిలిన వారసులకు నోటీసులు ఇవ్వడం వంటి ప్రక్రియలు పాటించాలి. కానీ ఈ కేసులో అలాంటి ప్రక్రియ ఏదీ పాటించకుండానే నేరుగా ఆన్‌లైన్ ఎంట్రీ చేసేశారని బాధితుడు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా, పోరుమామిళ్ల డిప్యూటీ తాసిల్దార్ కు అర్జీ ఇచ్చినా స్పందన రాలేదని, ప్రస్తుతం ఈ సర్వే నంబర్ పై రీ-సర్వే జరుగుతున్నందున వివాదం పరిష్కారం అయ్యే వరకు రికార్డును హోల్డ్ లో పెట్టాలని ఆయన కోరారు.
జేసీ కి ఇచ్చిన వినతిలో కీలక అంశాలు:
జాయింట్ కలెక్టర్ కి ఇచ్చిన అర్జీలో బాధితుడు ఈ క్రింది అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.1. 1987 నాటి అసలు డీకేటీ అసైన్మెంట్ రిజిస్టర్ పరిశీలన 2. వారసత్వ మార్పు కోసం ఇచ్చిన దరఖాస్తు, దానికి జతపరిచిన పత్రాలు ఏమిటి?3. ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండా ఏ ఆధారాలతో మ్యూటేషన్ చేశారు? ఏ అధికారి లాగిన్ తో ఆన్‌లైన్ చేశారు?4. మిగిలిన వారసులకు నోటీసులు ఇచ్చారా? లేదా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా రికార్డు మార్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుని, అర్హులైన ముగ్గురు వారసులకు న్యాయం చేయాలని ఆనందరావు విజ్ఞప్తి చేశారు.జేసీ మేడం సానుకూలంగా స్పందించి, సంబంధిత ఆర్డీవో, తాసిల్దార్ తో విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడిలో ఆశలు చిగురించాయి.

