📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaబిఆర్ఏఓయూ లో నూతన కోర్సులు

బిఆర్ఏఓయూ లో నూతన కోర్సులు

📰 Generate e-Paper Clip

బిఆర్ఏఓయూ లో నూతన కోర్సులు

మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి (డబ్ల్యూ ఈ సబ్) ప్రత్యేక కార్యక్రమాలు సెప్టెంబర్‌ 30 వరకు ప్రవేశాలు: డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బిఆర్ఏఓయూ) ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాలను అమలు చేస్తోందని విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌ తెలిపారు. మంగళవారం నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యయన కేంద్రoలో కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌ మాట్లాడారు. 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ,డిప్లొమా, సర్టిఫికెట్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో, సొంత వేగంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులు విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందిస్తున్నట్లు తెలిపారు. యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్‌, నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించి విద్యను మరింత సులభతరం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
మహిళా విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ
మహిళా విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి, వారిని భవిష్యత్‌ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బిఆర్ఏఓయూ– డబ్ల్యూ ఈ హబ్‌ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. “మీ ఆలోచనను వ్యాపారంగా మార్చండి.. మేము మీకు సహాయం చేస్తాము” అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు వ్యాపారాభివృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీతో వివిధ సంస్థలతో ఒప్పందాలు.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్‌ ధర్మ నాయక్‌ తెలిపారు. ఇప్పటికే టీసీఎస్‌, ఐకాన్‌, రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌, రాశి, వి-హబ్‌ వంటి సంస్థలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుర్తుచేశారు.
ప్రతి విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా నుంచి యూజీ, పీజీ ప్రవేశాలు అత్యధికంగా ఉంటాయని, ఈ ఏడాది కూడా అడ్మిషన్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కే. శ్రీనివాసరాజు, రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అనిల్‌ బొజ్జ, కళాశాల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ భూక్యా వీరన్న, డాక్టర్‌ సుంకరి రాజారామ్‌,అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు,నరేంద్ర పద్మ శంకర్ ఉస్మాన్ పాషా నగేష్ బద్దం మహేష్‌, బద్దం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.