పెద్దవంగర మండల అభివృద్ధిపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి .
ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం – అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.
పెద్దవంగర సెప్టెంబర్ 15 ప్రజావాణి
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దవంగర మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచులతో, పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్దవంగర మండలంలోని ప్రతి గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై శాఖల వారీగా ఎమ్మెల్యే సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, విద్యుత్, విద్య, వైద్య సేవలు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, సాగునీటి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పెద్దవంగర మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో ముందుకు సాగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమీక్ష సమావేశంలో పెద్దవంగర మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర మండల అభివృద్ధిపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి .
RELATED ARTICLES

