ప్రభుత్వ భూమిని కాపాడండి.. మైనింగ్‌ను అడ్డుకోండి!
లక్నవరం–జయగిరి శివారులో సర్వే నంబర్ 69లో గ్రానైట్ తవ్వకాలపై ఆరోపణలు
పైల మహిపాల్ రెడ్డి మైనింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని రైతులు, ప్రజలు, గ్రామస్తుల డిమాండ్
12 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని బొజ్జ చిన్న రాజు, పి. నరేష్ ఫిర్యాదు
హసన్‌పర్తి, సెప్టెంబర్ 28, మన ప్రజావాణి:
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం లక్నవరం–జయగిరి గ్రామ శివారులోని సర్వే నంబర్ 69లో ప్రభుత్వ భూమిలో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పైల మహిపాల్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ కార్యకలాపాలపై బొజ్జ చిన్న రాజు, పి. నరేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సుమారు 12 ఎకరాల 10 గుంటల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని, అనుమతులు లేకుండా తవ్వకాలు, భారీ బోర్ బ్లాస్టింగులు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారులు కోరారు.
ప్రభుత్వ భూమిలో తవ్వకాలపై విచారణ జరపాలి
సదరు ప్రాంతంలో మైనింగ్‌కు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనుమతుల పరిధికి మించి తవ్వకాలు జరుగుతున్నాయా? ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందా? అనే అంశాలను రెవెన్యూ, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని కోరారు.
బోర్ బ్లాస్టింగులతో ప్రజల్లో ఆందోళన

భారీ బోర్ బ్లాస్టింగుల కారణంగా దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం పెరిగి రైతులు, ప్రజలు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే తవ్వకాలను వెంటనే నిలిపివేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ప్రభుత్వ భూమిని కాపాడాలి.. మైనింగ్‌ను అడ్డుకోవాలి.. వాస్తవాలను వెలుగులోకి తేవాలి” అని రైతులు, ప్రజలు, గ్రామస్తులు కోరుతున్నారు.

