ప్రభుత్వం దిగిరాకుంటే తీవ్ర పరిణామాలు
కరువు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు విఫలం
తుంగభధ్ర, శ్రీశైలం నుంచి నీళ్లు వస్తున్నా సరిగ్గా అందించలేదు
హంద్రీనీవా ద్వారా వచ్చిన 10.5 టీఎంసీలు ఎక్కడికెళ్లాయి?
అనంతపురం జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం పడని పరిస్థితి
ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలూ ఎండిపోతున్నాయ్
అడుగంటిన భూగర్భ జలాలు.. 52 మి.మీ లోటు వర్షపాతం
రెండున్నరేళ్లలో ఏకంగా 200 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు
ఏ ఒక్క కుటుంబానికీ పరిహారం అందించని చంద్రబాబు
పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఎమ్మెల్యేలకు పట్టదా?
వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు
సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక దీక్షలకు సంఘీభావం
అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజా వాణి
కరువు సహాయక చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, జిల్లా రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ‘కరువు దీక్ష’లు ప్రారంభం అయ్యాయి. సామూహిక దీక్షలో అనంత వెంకటరామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఐదు దశాబ్ధాలుగా చూడని కరువు పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదని, జిల్లాలో 52 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సాగు చేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయని, తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పశువులకు గ్రాసం కొరతతో పాటు నీళ్లూ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని రెండు నెలల నుంచి తాము హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోయిందన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కూడా ఎల్‌నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కనీసం సమీక్ష చేయలేదని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఇటు తుంగభద్ర, అటు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తున్నా సరిగ్గా అందించలేకపోతున్నారని తెలిపారు. తుంగభద్ర నుంచి వచ్చే నీటిని తాగునీటికే పరిమితం చేశారని, ఆందోళనలు చేస్తే అరకొరగా రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో పంటలకు అందించారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి హంద్రీనీవా ద్వారా వచ్చే నీటిని సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాళ్లకు ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే హంద్రీనీవా నుంచి 10.5 టీఎంసీలు డ్రా చేశామని అంటున్నారని, ఆ నీళ్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉంటే వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయన్నారు. సుమారు లక్ష ఎకరాల్లో ఉన్న చీనీ పంటలు ఎండిపోతుంటే రైతులే తొలగించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాలో భూగర్భ జలాలు 16 మీటర్ల నుంచి 30 మీటర్ల లోతుకు పడిపోయాయని తెలిపారు. వందల అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా నీళ్లు పడని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. 2004 నుంచి ఇప్పటి వరకు రెండున్నరేళ్లలో జిల్లాలో ఏకంగా 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబానికీ పరిహారం అందించలేదని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని పణంగా పెట్టి శ్రీశైలం నుంచి కరెంట్ ఉత్పత్తి పేరుతో నీళ్లను తెలంగాణ తరలిస్తుంటే ఆ నీళ్లు మళ్లీ కృష్ణా డెల్టాకే చేరుతాయని చెప్పడం దారుణమన్నారు. అటు పట్టిసీమ, ఇటు శ్రీశైలం నుంచి నీళ్లు డెల్టాకే తరలించుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు.
కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచన చేయడం లేదని, ఎంత సేపూ తమ ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలన్న ఆలోచనే ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తోందని అన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే రైతాంగం తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సామూహిక దీక్షల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మాజీ మేయర్ మహమ్మద్ వసీం, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

