వైభవంగా ముగిసిన వేలం పాట – ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల సుధాకర్
వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 18 ప్రజావాణి పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని బలిజ కోట వీధిలో వెలసిన గణనాథుడి సన్నిధిలో నిర్వహించిన లడ్డు వేలం పాట భక్తుల కోలాహలం, జయజయధ్వానాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుని చెంత ఉంచిన 41 కేజీల భారీ లడ్డూకు వేలం పాటలో ఊహించని రీతిలో భారీ ధర పలికింది. పోరుమామిళ్ల పరిసర ప్రాంతాల్లోనేఈ లడ్డు ఏకంగా 80 వేల రూపాయల పలుకడం విశేషం.
భారీగా తరలివచ్చిన భక్తులు – పోటాపోటీగా వేలం పాట:
బలిజ కోట వీధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఐదు రోజుల ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఈ లడ్డూ వేలం పాటను ప్రారంభించారు. స్వామివారి ప్రసాదంగా భావించే ఈ లడ్డును దక్కించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో వేలం పాటలో పాల్గొనేందుకు భక్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లడ్డును కైవసం చేసుకునేందుకు పలువురు భక్తులు పోటాపోటీగా పాట పాడారు. ఒకరిని మించి మరొకరు ధరను పెంచుకుంటూ పోవడంతో అక్కడి వాతావరణం అంతా ఆధ్యాత్మిక ఉత్కంఠగా మారింది. ఆఖరి వరకు ఉత్సాహంగా సాగిన ఈ వేలం పాటలో బలిజ కోట వీధికి చెందిన స్థానికులు చెన్ను శ్రీనివాసులు, చెన్ను నాగమణి దంపతులు అత్యధికంగా 80 వేల రూపాయలు పాడి,ఆ విఘ్నేశ్వరుని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఆయన సమక్షంలోనే ఉత్సవ కమిటీ సభ్యులు వేలం పాటను పారదర్శకంగా, ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యనమల సుధాకర్ మాట్లాడుతూ.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని కొనియాడారు.కడప జిల్లాలోనే ఈ ప్రాంతంలో ఇంతటి భారీ ధరకు లడ్డు అమ్ముడుపోవడం భక్తుల అపార నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.వేలం పాటలో లడ్డును దక్కించుకున్న చెన్ను శ్రీనివాసులు,నాగమణి దంపతును ఉత్సవ కమిటీ సభ్యులు,స్థానికులు ఘనంగా అభినందించారు.స్వామివారి కృప తమ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ,ఈ దంపతులు ఉత్సవాల విజయవంతానికి కృషి చేసిన పలువురు ప్రముఖులకు,కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ రికార్డు స్థాయి వేలం పాటను కళ్లారా చూసిన పోరుమామిళ్ల పట్టణ ప్రజలు, భక్తులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. బలిజ కోట వీధి వినాయక కమిటీ వారు చేసిన ఏర్పాట్లను అందరూ అభినందించారు.ఈ కార్యక్రమంతో పోరుమామిళ్లలో ఐదు రోజుల పాటు జరిగిన గణేష్ ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ముగిశాయి.

