*గ్రామాల భద్రతకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కీలకం*
*రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాలు*
*రూ. 1.50 కోట్లతో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు – ఈ-టెండర్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి*
*- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి):
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ లతో కలిసి సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు మొత్తం రూ. 1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేపడుతున్నామని చెప్పారు.
ప్రతి గ్రామంలో రెండు సీసీ కెమెరాలను గ్రామ ప్రవేశ, నిష్క్రమణ (ఎంట్రీ-ఎగ్జిట్) ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పనులు ప్రభుత్వ మార్గదర్శకాలు, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు.
*మండలాల వారీగా ఏర్పాటు చేయనున్న కెమెరాల వివరాలు:*
బచ్చన్నపేట – 56, నర్మెట – 38, తరిగొప్పుల – 34, జనగామ రూరల్ – 167, లింగాల ఘనపురం – 54, రఘునాథపల్లి – 84, చిల్పూర్ – 42, ఘనపూర్ స్టేషన్ – 38, జఫర్ గడ్ – 46, పాలకుర్తి – 80, కొడకండ్ల – 46, దేవరుప్పుల – 68 కెమెరాలు.
సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అవసరమైన కేబుల్ నెట్ వర్క్, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్ వేర్, వీడియో వాల్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జాతీయ రహదారులు, మండల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సీసీ పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఈ ప్రక్రియ ఈ-టెండర్ విధానంలోనే చేపట్టాలని, జి.ఓ. నెం. 52 (I&PR) నిబంధనల ప్రకారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని, టెండర్ నోటిఫికేషన్ ను సంబంధిత వెబ్ సైట్ లో తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీపీఓ వెంకట్ రెడ్డి, ఏసీపీలు భీమ్ శర్మ, నర్సయ్య, ఇతర పోలీసు అధికారులు, డి-సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సి-సెక్షన్ సూపరింటెండెంట్ ఫణి కిశోర్, ఎస్ హెచ్ వోలు తదితరులు పాల్గొన్నారు.

