- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందే
హైదరాబాద్: విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కళాశాలలకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే, విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ తదుపరి కార్యాచరణను చేపడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్. కృష్ణయ్య, శాసనసభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి తదితరులు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రవి నాయక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి లాల్ నాయక్, మెదక్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు శ్రీ లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేసి విద్యార్థుల చదువులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మొండివైఖరిని విడనాడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం అవసరమైతే మరింత ఉధృతంగా పోరాటాలు చేపడతామని వారు స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందే
RELATED ARTICLES

