పోత్కాపల్లి ఆటో స్టాండ్ వద్ద ఘటన
రంజిత్ నిజాయితీపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు
పోత్కాపల్లి ఆగస్టు 24 ప్రజావాణి :
తన వద్ద ఉన్న విలువైన పత్రాలను పొరపాటున మర్చిపోయిన ఒక రైతుకు వాటిని సురక్షితంగా తిరిగి అందించి పోత్కాపల్లి మారుతి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సొల్లు రంజిత్ తన నిజాయితీని చాటుకున్నారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాయపేట గ్రామానికి చెందిన ఒక రైతు స్థానిక పోత్కాపల్లి ఆటో స్టాండ్ వద్ద తన బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, ఏటీఎమ్ కార్డుతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాల బ్యాగును పొరపాటున వదిలేసి వెళ్లాడు. ఆ పత్రాలను గమనించిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సొల్లు రంజిత్ వెంటనే స్పందించారు.
ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా రాయపేట గ్రామానికి సమాచారం అందించి, ఆ రైతు ఫోన్ నంబర్ సేకరించారు. అనంతరం సదరు రైతును ఆటో స్టాండ్ వద్దకు పిలిపించి, ఆయన పత్రాలన్నింటినీ భద్రంగా అప్పగించారు. పోగొట్టుకున్నాయనుకున్న విలువైన పత్రాలు తిరిగి దక్కడంతో సదరు రైతు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ, రంజిత్ నిజాయితీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంజిత్ చూపిన చాకచక్యం, ఉదారతను స్థానికులు మరియు ఆటో డ్రైవర్లు కొనియాడారు.

