📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఎస్టిపిపిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎస్టిపిపిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

జైపూర్ , ఆగస్టు 15, ప్రజావాణి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో (ఎస్టిపిపి) శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టిపిపి కార్యనిర్వాహక సంచాలకులు (ఈడి) సిహెచ్. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఈడి చిరంజీవి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం, రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. 79 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. దేశాభివృద్ధిలో సింగరేణి సంస్థ, అలాగే ఎస్టిపిపి భాగస్వామ్యం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి నాయకత్వంలో కంపెనీ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో తాడిచర్ల ఓసి-2 బొగ్గు గని, మణుగూరు డీప్ సైడ్ బ్లాక్‌లు సింగరేణికి దక్కడంతో సంస్థ మనుగడకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అలాగే నైని బొగ్గు గని నుంచి తొలిసారిగా తెలంగాణలోని ఎస్టిపిపికి రైల్వే ర్యాక్ ద్వారా బొగ్గు రావడం శుభపరిణామమని తెలిపారు. 30 ఏళ్ల గని జీవిత కాలం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్దపీట వేస్తోందని, సిఎస్ఆర్ నిధులతో నిరంతరం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

ఉత్తమ ఉద్యోగులకు సత్కారం:

కార్యక్రమంలో భాగంలో విధుల్లో ప్రతిభ కనబరిచిన సీనియర్ అసిస్టెంట్ లక్కోజు బాలసుబ్రహ్మణ్యం, వార్డ్ అసిస్టెంట్ అడ్డూరి కిరణ్ కుమార్‌లను శాలువా, పూలమొక్క, ప్రశంసాపత్రం, మెమొంటోలతో సత్కరించారు. అలాగే ఉత్తమ సింగరేణియన్‌గా ఎంపికైన సీనియర్ అసిస్టెంట్ మెరుగు రాజ్‌కుమార్ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన సెంట్రల్ ఫంక్షన్‌లో సీఎండీ, డైరెక్టర్ల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ వేడుకల్లో జీఎం (పిసిఎస్) కే. సూర్యనారాయణ రాజు, సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్, ఏఐటియుసి పిట్ సెక్రెటరీ సిహెచ్. సత్యనారాయణ, సీఎంబఓఏఐ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ పి. అప్పారావు, ఏజిఎం (ఫైనాన్స్) బి. శ్రీధర్, పర్సనల్ విభాగాధిపతి ఎస్వి రాజేశ్వర్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.