కాశినాయన (ఇటుకలపాడు) ప్రజావాణి నవంబర్ 27 :
ఇటుకులపాడు జెడ్పీ హైస్కూల్‌లో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి విద్యార్థులకు అవగాహన
ఇటుకులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ నవ్యత ప్రసూన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) సుధాకర్, అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని అరికట్టాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ నవ్యత ప్రసూన మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా బాలికల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరగాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సులోనే వివాహాలు చేయకుండా, ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.
అలాగే ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని అన్నారు.
అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇటుకులపాడు జెడ్పీ హైస్కూల్‌లో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం
RELATED ARTICLES

