📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకర్రెగుట్టల టూరిజం ప్రాజెక్టుకు ‘మందుపాతరల’ బ్రేక్

కర్రెగుట్టల టూరిజం ప్రాజెక్టుకు ‘మందుపాతరల’ బ్రేక్

📰 Generate e-Paper Clip

కర్రెగుట్టల టూరిజం ప్రాజెక్టుకు ‘మందుపాతరల’ బ్రేక్!

• అడుగడుగునా ల్యాండ్‌మైన్లు, ఐఈడీల ముప్పు.. వరుస పేలుళ్లతో బెంబేలు

• అడవిలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్న స్థానిక గిరిజనులు

• నిలిచిపోయిన వాచ్ టవర్, పర్యాటక భవనాల నిర్మాణాలు

• ఉపాధి ఆశలపై నీళ్లు.. ముప్పు తొలగే వరకు పర్యాటకులకు నో ఎంట్రీ: డీజీపీ

వెంకటాపురం (వాజేడు), నవంబర్ 25 (మన ప్రజావాణి): తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దట్టమైన అడవులు, కొండలు, లోయలు, జలపాతాలతో ప్రకృతి అందాలకు నెలవైన కర్రెగుట్టలను ఎకో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మావోయిస్టులు గతంలో అమర్చిన మందుపాతరలు (ల్యాండ్‌మైన్లు), ఐఈడీల ముప్పు ఇంకా తొలగిపోకపోవడంతో పర్యాటక అభివృద్ధి పనులు నిలిచిపోవడమే కాకుండా, స్థానిక గిరిజనులు సైతం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
ప్రకటన ఘనం.. పనులకు ఆటంకం:
మావోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించి, ఆ ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాయి. అనంతరం ఏప్రిల్ 5న తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ కర్రెగుట్టల్లో పర్యటించి దీనిని ఎకో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సుమారు 145 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న కర్రెగుట్టల్లో 29 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి (పామునూరు నుంచి తడపల వరకు) శ్రీకారం చుట్టడంతో పాటు వ్యూ పాయింట్లు, జంగిల్ సఫారీ, ట్రెక్కింగ్, వాచ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ప్రస్తుతం మందుపాతరల భయంతో వాచ్ టవర్, ఇతర పర్యాటక భవనాల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు.
వరుస పేలుళ్లు.. భారీగా ఆయుధ డంప్‌లు:
మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించినప్పటికీ, గుట్టల్లో అడుగడుగునా మందుపాతరల ముప్పు పొంచి ఉంది. ఇటీవల రహదారి నిర్మాణ సందర్భంగా 14 ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో జరిగిన పేలుళ్లలో 9 మంది డీఆర్‌జీ జవాన్లు, ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. పామునూరు బేస్ క్యాంపు సమీపంలో మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. మరోవైపు ఈ నెల 6న బీజాపూర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 711 బీజీఎల్ సెల్స్, ల్యాండ్‌మైన్లు స్వాధీనం కాగా, పూజారి కాంకేర్ సమీపంలో 455 ఎలక్ట్రిక్, 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, కమ్యూనికేషన్ సామగ్రి బయటపడ్డాయి.
బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు.. ఉపాధిపై దెబ్బ: వరుస పేలుళ్లు, ఆయుధ డంప్‌ల వెలికితీతతో సరిహద్దు గిరిజన గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు, పశువులను మేపడానికి అడవిలోకి వెళ్లాలంటేనే స్థానిక ఆదివాసీలు వణికిపోతున్నారు. ఇటీవల సెప్టెంబర్ 2న వెదురు బొంగుల సేకరణకు తడపల గుట్టలకు వెళ్లిన ఒక గిరిజనుడు మందుపాతర పేలి మృతి చెందడం, పలుచోట్ల మూగజీవాలు బలవడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. మరోవైపు కర్రెగుట్టలు పర్యాటక కేంద్రంగా మారితే తమకు స్థానికంగా ఉపాధి లభిస్తుందని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన యువత, స్థానికులకు ఈ పరిణామాలు నిరాశను మిగిల్చాయి.
పర్యాటకులు రావద్దు.. పోలీసుల హెచ్చరిక:
గుట్టల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని, ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లవద్దని బీజాపూర్ ఏఎస్పీ రాహుల్ బన్సాల్ హెచ్చరించారు. మందుపాతరల ముప్పు పూర్తిగా తొలగే వరకు కర్రెగుట్టల వైపు పర్యాటకులను అనుమతించబోమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సైతం స్పష్టం చేశారు. భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో గుట్టలను జల్లెడ పట్టి, ప్రమాదం లేదని నిర్ధారించే వరకు పర్యాటక అభివృద్ధికి, ప్రకృతి ప్రేమికుల రాకకు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిహద్దుల అటవీ ప్రాంతాలకు వెళ్లే స్థానికులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.