ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
తెనుగువాడలో జెండా ఆవిష్కరించిన జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 21
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ 18వ వార్డులో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య జెండాను ఆవిష్కరించి మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా చేపల వేటను ప్రధాన వృత్తిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల కష్టానికి, శ్రమకు సమాజంలో తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారుల ఐక్యత, సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, వారి సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను విస్తరించాలని కోరారు. మత్స్యకారుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాలని, ఐకమత్యంతోనే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మౌటం నర్సింగం, భూతగడ్డ తిరుపతి, భూతగడ్డ సారయ్య, కొలిపాక లక్ష్మణ్, వేల్పుల రాజేశం, మౌటం శంకర్, ఆశాలు, వేల్పుల కనుకయ్య, వేల్పుల సంతోష్, గంగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

