పోరుమామిళ్ల,నవంబర్ 2: ప్రజావాణి వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కార్యాలయంలో అత్యంత కీలకమైన డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలు దాటినప్పటికీ డీటీ సీటు ఖాళీగానే దర్శనమివ్వడం ఇక్కడి విధుల్లో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
కథనాలు వచ్చినా మారని తీరు:
పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో అధికారుల లేటు రాకపై, ప్రజల ఇబ్బందులపై గతంలో కూడా అనేకసార్లు పత్రికల్లో, మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు కానీ,ఇక్కడి సిబ్బంది కానీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.గతంలో వచ్చిన వార్తలను కనీసం పట్టించుకోకుండా అధికారులు తమ పంథాను కొనసాగిస్తుండటంతో, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గంటల తరబడి వేచి చూస్తున్న బాధితులు:
దూర ప్రాంతాల నుండి వివిధ సర్టిఫికేట్లు,భూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న రైతులు,వృద్ధులు, విద్యార్థులు కార్యాలయ ముఖద్వారం వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉదయాన్నే ఆఫీసుకు చేరుకున్నా, సంబంధిత అధికారి సీట్లో లేకపోవడంతో పనులు కాక వెనుదిరగాల్సి వస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బయోమెట్రిక్ విధానాలు,కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, పోరుమామిళ్లలో మాత్రం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి,పోరుమామిళ్ల తహసీల్దార్ కార్యాలయంలో డీటీ ల సమయపాలనపై తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

