బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి బాపట్ల జిల్లా అక్టోబర్ 26
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి అర్నబ్ తుఫాన్‌గా మారనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
*తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేత*
*అక్టోబర్ 27 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు, సందర్శకులకు అనుమతి లేదు*
*మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలి*
*లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి*
*గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం సూచించిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి*
*వరద నీటితో పొంగిపొర్లే కల్వర్టులు, వాగులు, వంకలు, నదులను దాటేందుకు ప్రయత్నించవద్దు*
*అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలి*
*విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది*
*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్*
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి అర్నబ్ తుఫాన్‌గా మారనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సూచించారు.తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న బీచ్‌లను తాత్కాలికంగా మూసివేసినట్లు, అక్టోబర్ 27 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రజలు, పర్యాటకులు, సందర్శకులకు సముద్ర తీర ప్రాంతాల్లోకి అనుమతి లేదని సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పోలీస్, రెవెన్యూ అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రాంతాలకు లేదా తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఎస్పీ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. మత్స్యకారులు తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు.
తుఫాన్ ప్రభావం దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వారు ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఎస్పీ గారు సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం సూచించిన పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
వరద నీటితో పొంగిపొర్లే కల్వర్టులు, వాగులు, వంకలు, నదులను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలను హెచ్చరించారు. అక్టోబర్ 27, 28 తేదీలలో తుఫాను ప్రభావం జిల్లా పై అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా ఇతర సందర్భాలలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైన చోట్ల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఈదురు గాలుల కారణంగా రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడిన సందర్భాల్లో వాటిని వెంటనే తొలగించి, రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకునేందుకు అవసరమైన పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
నదీ పరీవాహక ప్రాంతాల్లో, వాగులు వంకలలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రయాణాలకు అనువుగా లేని మార్గాలు, నీట మునిగిన రహదారులు, కల్వర్టుల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి, అవసరమైన చోట్ల రాకపోకలను నిలిపివేసి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్‌లు, తాళ్లు వంటి రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, అందుకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు.
ఆపదలో ఉన్న ప్రజలను రక్షించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని, తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ బృందాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ mjjPpపోలీస్ సహాయం కోసం డయల్ 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8333813228కు ఫోన్ చేయాలని, లేదా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

