మార్కాపురం జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మార్కాపురం జిల్లా
జిల్లాలో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి సన్నద్ధత
ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి, రిజర్వేషన్లు మరియు గెజిట్ నోటిఫికేషన్లు జారీ.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఎన్నికల ప్రధానాంశాలు మరియు షెడ్యూల్ వివరాలు:
జిల్లాలో మొదటిగా ఎంపీటీసీలు, ఆ తర్వాత జెడ్పీటీసీలు, చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించబడనున్నాయని తెలిపారు. జిల్లాలో పొదిలి తప్ప మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు.
మొత్తం 100 వార్డుల్లోని 163 పోలింగ్ స్టేషన్లలో అర్బన్ లోకల్ బాడీల (యూఎల్బి) ఎన్నికలు ఖరారు చేయబడి, వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయని వెల్లడించారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున, అక్టోబర్ 16వ తేదీన సంబంధిత ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేయడం ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
నామినేషన్ల స్వీకరణ ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు కేవలం నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. నామినేషన్లు అక్టోబర్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయన్నారు. అక్టోబర్ 19న తనిఖీ ఉంటుందని, అక్టోబర్ 21 వరకు ఉపసంహరణ గడువని, ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితా అదే రోజున ఖరారు చేయబడుతుందని తెలియజేశారు.
ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ అక్టోబర్ 28వ తేదీన జరుగుతుందని వెల్లడించారు.
ఎన్నికల సిబ్బంది శిక్షణ మరియు పకడ్బందీ ఏర్పాట్లు.
ఎన్నికలకు సంబంధించి జిల్లా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలోని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వివరాలు రెవెన్యూ మరియు పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో ఖరారు చేయబడి, బందోబస్తు ఏర్పాట్లు, వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అన్ని చర్యలు పకడ్బందీగా చేపడుతున్నామని వ్యాఖ్యానించారు.

