*ఫైజాబాద్ లో ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు*
బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన
*చిలిపిచెడ్, అక్టోబర్ 15 (మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి):*
చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలికల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై దాని ప్రభావం గురించి అధికారులు వివరించారు. 18 ఏళ్ల లోపు వివాహం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం ఫైజాబాద్ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కిషోర్ బాలికలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. బాలికలందరూ చదువుకోవాలని, బాల్య వివాహాలను ఎక్కడ జరిగినా అడ్డుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ తాళ్ల రాములు, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి , గ్రామ పాలకమండలి సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది డి సి పి ఓ నాగరాజు, డీఎంసీ సంతోషి, అంగన్వాడీ టీచర్ శశికళ పాల్గొన్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో హర్షిని, కబడ్డీ పోటీలో శైలజ విజేతలుగా నిలిచారు. వారిని అధికారులు, సర్పంచ్ ఘనంగా సన్మానించారు.
బతుకమ్మ సంబరాలతో కార్యక్రమం కోలాహలంగా సాగింది.

