మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మరో అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
సిద్దిపేటలో రెండు కేసుల్లో న్యాయస్థానం తీర్పులు
సిద్దిపేట, అక్టోబర్ 15 (ప్రజావాణి)
మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి అపహరించి, వివాహం చేసుకొని అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బండి భాస్కర్ (27)కు సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.18 వేల జరిమానా విధించింది.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి చెందిన మైనర్ బాలికను నిందితుడు ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు 2022 ఏప్రిల్ 22న రాజగోపాలపేట పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి ఎస్సై మహిపాల్ రెడ్డి, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి,సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ను న్యాయస్థానంలో దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు వాదనలు వినిపించారు.సాక్ష్యాధారాలు, సాక్షులవాంగ్మూలాలను పరిశీలించిన న్యాయమూర్తి వై. జయప్రసాద్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ఈ తీర్పు వెలువరించారు.మరో కేసులో రెండేళ్ల జైలు శిక్ష,సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 డిసెంబర్ 17న నమోదైన మరో కేసులో బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడి, ఆమె ప్రతిఘటించడంతో తలపై కర్రతో కొట్టి గాయపరిచిన నిందితుడు మిట్టపల్లి రాజు (35)కు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై. జయప్రసాద్ 2025 అక్టోబర్ 14న తీర్పు వెల్లడించారు.
ఈ రెండు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు.మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని, నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

