📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి*

*పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి*

📰 Generate e-Paper Clip

*పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి*

*పల్లె దవాఖానాల్లో సేవలు పకడ్బందీగా అందించాలి*

*నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్*

మేడ్చల్, నేడు న్యూస్: పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సకాలంలో, సమర్థవంతంగా అందేలా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్ సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అంటాయిపల్లిలోని ఐడీఓసీ మొదటి అంతస్తులో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో పల్లె దవాఖానాల మెడికల్ ఆఫీసర్లు (ఎంఎల్‌హెచ్‌పీలు), రిపోర్టింగ్ సూపర్వైజర్లతో డా. కె. ఆనంద్ కార్యక్రమాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు డివిజన్ల ఉప జిల్లా వైద్య అధికారులు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, పల్లె దవాఖానాల ఎంఎల్‌హెచ్‌పీలు, రిపోర్టింగ్ సూపర్వైజర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. ఆనంద్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు పల్లె దవాఖానాలు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే కీలక కేంద్రాలని తెలిపారు. ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఎల్‌హెచ్‌పీలు తమ పరిధిలోని ఆశా, ఏఎన్‌ఎం సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

*మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి*

మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డా. ఆనంద్ సూచించారు. గర్భిణీలను ప్రారంభ దశలోనే గుర్తించి నమోదు చేయడం, ఏఎన్‌సీ పరీక్షలు నిర్వహించడం, హైరిస్క్ గర్భిణీలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించడం, అవసరమైన టీకాలు, పోషకాహార సప్లిమెంట్లు అందించడం వంటి సేవలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రసవానంతర సేవలు అందించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో ఉన్నత వైద్య కేంద్రాలకు సకాలంలో రిఫర్ చేయాలని తెలిపారు.

నవజాత శిశువులు, శిశువులు, పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, పోషకాహార లోపాలను ముందుగానే గుర్తించి తగిన వైద్యం, రిఫరల్ సేవలు అందించాలని సూచించారు.

*సాధారణ వ్యాధులకు స్థానికంగానే వైద్యం*

జ్వరం, విరేచనాలు, నీటి ద్వారా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, టైఫాయిడ్, చర్మ సంబంధిత సమస్యలు తదితర సాధారణ అనారోగ్యాలకు పల్లె దవాఖాన స్థాయిలోనే అవసరమైన వైద్యం అందించాలని డా. ఆనంద్ తెలిపారు. తీవ్రత ఉన్న కేసులను ఆలస్యం చేయకుండా ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు.

టిబీ నియంత్రణ కార్యక్రమంలో డాట్స్ సేవలను, కుష్ఠు వ్యాధి నియంత్రణలో డీపీఎంఆర్ సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

*అసాంక్రమిక వ్యాధులపై నిరంతర స్క్రీనింగ్*

మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులకు నిరంతరం స్క్రీనింగ్ నిర్వహించాలని డా. ఆనంద్ సూచించారు. వ్యాధులు గుర్తించిన వారికి చికిత్స అందించడంతో పాటు ఫాలోఅప్, చికిత్స కొనసాగింపును పర్యవేక్షించాలని తెలిపారు. కిశోర బాలబాలికలకు ఆరోగ్య సలహాలు అందించడం, పోషకాహార లోపాలను గుర్తించడం, అవసరమైన చికిత్స, రిఫరల్ సేవలు కల్పించాలన్నారు.

*మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు*

పల్లె దవాఖానాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డా. ఆనంద్ తెలిపారు. అవసరమైన జేఏఎస్‌ నిధులు సకాలంలో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుబాటులో ఉన్న నిధులను ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఆరోగ్య కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంలో ఎంఎల్‌హెచ్‌పీల పాత్ర కీలకమని డా. ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించడంతో పాటు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, రికార్డులు, ఆన్‌లైన్ డేటాను సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందాల్సిన వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేస్తూ, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిర్దేశిత కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయకపోయినా లేదా ప్రజలకు అందాల్సిన సేవల్లో అలసత్వం ప్రదర్శించినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డా. ఆనంద్ హెచ్చరించారు. అవసరమైతే వారి సేవలను కొనసాగించే విషయంలో జిల్లా యంత్రాంగం వెనుకాడదని స్పష్టం చేశారు. ప్రతి ఎంఎల్‌హెచ్‌పీ తన పరిధిలోని ప్రజలకు అందించే ఆరోగ్య సేవలకు పూర్తి బాధ్యత వహిస్తూ విధులు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.