📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

📰 Generate e-Paper Clip

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

* కోటపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో శంకుస్థాపనలు

* ‘కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్’ ప్రారంభం

 

చెన్నూరు, ఆగస్టు 19,ప్రజావాణి :

 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, అదనపు గదుల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కోటపల్లిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రూ.50 లక్షల సింగరేణి సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గతంలో ఈ పాఠశాల దుస్థితిని చూసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌కు రూ.15 లక్షలు, వసతుల కల్పనకు మరో రూ.80 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టించుకోని పనులను ఇప్పుడు తమ ప్రభుత్వం చేపడుతోందన్నారు. పాఠశాలలో 97 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని, రానున్న రోజుల్లో 100 శాతం సాధించాలని ఆకాంక్షించారు. సోమనపల్లిలో రూ.250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. చెన్నూరులో సెప్టెంబర్ 4న 100 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తామని, ఇప్పటికే 23 మంది వైద్యులు వచ్చారని, అందుబాటులోకి తెచ్చిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ హక్కుల కోసం చదువుకుంటూనే ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధికి మంత్రి వివేక్ కృషి చేస్తున్నారని కొనియాడారు.

 

*కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ ప్రారంభం*

 

చెన్నూరు పట్టణంలో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని (ఫ్రీ కోచింగ్ సెంటర్) మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలతో కలిసి ప్రారంభించారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చెన్నూరు నియోజకవర్గం నుంచే అత్యధిక ఉద్యోగాలు సాధించి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.