📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కడప జిల్లా లో సచివాలయాల్లో ఏఎన్ఎంల కొరత.స్పందించని అధికారులు

కడప జిల్లా లో సచివాలయాల్లో ఏఎన్ఎంల కొరత.స్పందించని అధికారులు

📰 Generate e-Paper Clip

(ఆంధ్రప్రదేశ్-క్షేత్రస్థాయి ప్రతినిధి):ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థలో సిబ్బంది కొరత మరియు అధికారుల అసమర్థ నిర్వహణ వెరసి ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడంలో అత్యంత కీలకమైన ‘గ్రేడ్-3 డిజిటల్ హెల్త్ అసిస్టెంట్’ పోస్టుల భర్తీ, కేటాయింపుల్లో ఘోరమైన అసమతుల్యత నెలకొంది. జిల్లాలోని పలు గ్రామ సచివాలయాల్లో అసలు ఏఎన్ఎంలే లేక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తుంటే, అధికార ప్రజాప్రతినిధుల సిఫార్సులు,రాజకీయ ఒత్తిళ్లతో మరికొన్ని పట్టణ మరియు కీలక సచివాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట ఇద్దరు,ఏఎన్ఎంలు విధుల్లో కొనసాగుతున్నారు.ఈ వ్యత్యాసాలను సరిదిద్దాల్సిన జిల్లా వైద్యాధికారులు మరియు సచివాలయ అధికారులు కనీస చొరవ చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పడకేసిన వైద్య సేవలు – క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు:
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలను గుర్తించి గర్భం దాల్చిన నాటి నుండి కాన్పు అయ్యే వరకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయడం,ప్రభుత్వ పథకాల కింద శిశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయడం,బాలింతల సంరక్షణ చూడటం ఏఎన్ఎంల ప్రధాన బాధ్యత. అంతేకాకుండా,ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు (డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్) నియంత్రణకు గానూ గ్రామాల వెంబడి తిరుగుతూ హెల్త్ సర్వేలు చేయడం,మందులు పంపిణీ చేయాల్సి ఉంటుంది.అయితే ఏఎన్ఎంలు లేని సచివాలయాల పరిధిలో ఈ సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి.గర్భిణులు చిన్నపాటి ల్యాబ్ పరీక్షలు,బీపీ,షుగర్ తనిఖీల కోసం కూడా కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.దీంతో ఆర్థికంగా,శారీరకంగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.టీకాలు సకాలంలో అందక చిన్న పిల్లల తల్లులు ఆందోళన చెందుతున్నారు.
రాజకీయ సిఫార్సులు–హేతుబద్ధీకరణ కరవు:
సచివాలయ నిబంధనల ప్రకారం ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎం ఉండాలి.కానీ,జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న సచివాలయాల్లోనూ,రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ లూప్ హోల్స్ ఉపయోగించుకుని డిప్యుటేషన్లు లేదా వర్క్ ఆర్డర్ల పేరుతో అదనపు సిబ్బందిని కేటాయించారు. ఒకేచోట మిగులుగా ఉన్న సిబ్బంది ఉదయం వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా గడుపుతుంటే,పక్కనే ఉన్న గిరిజన, లంబాడ లేదా సుదూర గ్రామాల్లోని సచివాలయాలు సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి.ఖాళీగా ఉన్న చోట్ల తాత్కాలికంగానైనా పక్క సచివాలయ ఏఎన్ఎంలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంలో కూడా అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. దీనివల్ల సచివాలయాల్లో ఆరోగ్య రికార్డుల నిర్వహణ మరియు ఆన్‌లైన్ సర్వేల డేటా నమోదు అస్తవ్యస్తంగా తయారైంది.
అధికారుల తీరుపై ప్రజాసంఘాల మండిపాటు – ఆందోళన హెచ్చరికలు:
సిబ్బంది కొరతపై స్థానిక ప్రజలు,సచివాలయ కన్వీనర్లు పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.”సమస్య మా దృష్టికి రాలేదు””త్వరలోనే సర్దుబాటు చేస్తాం” అంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రాక్టికల్గా చర్యలు శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు.ఈ రకమైన నిర్లక్ష్య వైఖరి వల్ల గ్రామీణ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే బదిలీలు లేదా హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టి అన్ని సచివాలయాలకు ఏఎన్ఎంలను సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి మరియు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి,వైద్యాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించాలి. జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయాల వారీగా ఏఎన్ఎంల వివరాలను ఆడిట్ చేసి,మిగులుగా ఉన్న వారిని తక్షణమే ఖాళీలు ఉన్న సచివాలయాలకు బదిలీ చేయాలి. గ్రామీణ ప్రజలకు,గర్భిణులకు రాజ్యాంగం కల్పించిన కనీస ఆరోగ్య హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు అధికారులపై ఎంతైనా ఉంది.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.