నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.

ఉమ్మడి జిల్లా జోనల్ అధికారిణి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి.

హుజూర్నగర్ ఆగస్టు 14 (ప్రజావాణి)
ఉమ్మడి జిల్లా జోనల్ అధికారిణి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు హుజూర్నగర్ పట్టణంలోని పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పలు అనుమానాస్పద రంగులు గల పప్పులు, కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ అయిన) ఆహార వస్తువులు, ప్రభుత్వం నిషేధించిన టొబాకో మరియు నికోటిన్ ఉత్పత్తులపై విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా కొన్ని షాప్స్, హోటల్స్ లలో అనుమానాస్పద ఆహార నమూనాలను (శాంపిల్స్) సేకరించి, ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రతి చిన్న, పెద్ద ఆహార వ్యాపారులు , హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల వద్ద లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్స్ పొందాలి. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రంగుల ఆహార పదార్థాలు, లూస్ టీ పౌడర్స్,లూస్ ఆయిల్స్, గడువు ముగిసిన వస్తువులను విక్రయించరాదు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, టొబాకో, నికోటిన్ ప్రొడక్ట్స్ అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. హోటళ్లు మరియు కిరాణా షాపులలో నిల్వ ఉంచే ఆహార పదార్థాల వద్ద పూర్తి పరిశుభ్రత పాటించాలి. ఇటీవల కాలంలో కొంతమంది తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి స్థానిక వ్యాపారులను పిలిపించి విచారణ జరిపారు. ఎవరైనా అధికారులు తనిఖీలకు వస్తే వారి గుర్తింపు కార్డులను (ఐడి కార్డ్స్) అడిగి ధృవీకరించుకోవాలని సూచించారు. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇచ్చే లైసెన్సులు చెల్లుబాటు కావని, అటువంటి నకిలీ లైసెన్సులు రిజిస్ట్రేషన్లు ఇచ్చే నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు వచ్చి బెదిరింపులకు పాల్పడితే, వ్యాపారులు భయపడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.
ఈ తనిఖీల్లో స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులు, బి ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు.
