📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

మెంబర్‌షిప్ పేరుతో మోసం.. రేట్లు తగ్గట్లేదని పోరుమామిళ్ల సూపర్ ‘K’ కస్టమర్ల ఆవేదన; రూ.15 లక్షలు పెట్టి నష్టపోయామంటున్న షాప్ యజమాని
పోరుమామిళ్ల, జూలై 12 (ఆంధ్రప్రభ/
పోరుమామిళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘సూపర్ K’ (లక్ష్మి వెంకటేశ్వర సూపర్ మార్కెట్) చుట్టూ ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రారంభంలో మెంబర్‌షిప్ కార్డులు తీసుకుంటే మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలకే సరుకులు అందిస్తామని నమ్మబలికి, తీరా ఇప్పుడు సాధారణ ఎంఆర్‌పి (MRP) ధరలకే అమ్ముతున్నారని వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఫ్రాంచైజీ నమ్మి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన స్థానిక షాప్ యజమాని సైతం తాను ఘోరంగా నష్టపోయానని లబోదిబోమంటున్నారు.
ప్రారంభంలో ఆశలు.. తీరా చూస్తే మోసాలు!
కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ సర్కిల్ వద్ద వెలిసిన ఈ సూపర్ K మార్కెట్, వినియోగదారులను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. “మెంబర్‌షిప్ చేసుకోండి.. ప్రతి బిల్లుపై భారీ ఆఫర్లు, 10% క్యాష్ బ్యాక్ పొందండి, మార్కెట్ కంటే తక్కువ ధరలకే సరుకులు తీసుకెళ్లండి” అంటూ ప్రచారం చేయడంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో మెంబర్‌షిప్‌లు తీసుకున్నారు.
అయితే, కొద్దిరోజులు గడవక ముందే అసలు రంగు బయటపడింది. మార్కెట్‌కు వెళ్తున్న కస్టమర్లకు ఎలాంటి డిస్కౌంట్లు రాకపోగా, సాధారణ దుకాణాల్లో దొరికే ఎంఆర్‌పి ధరలకే సరుకులు ఇస్తుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. “మెంబర్‌షిప్ కార్డు కోసం డబ్బులు కట్టించుకుని ఇప్పుడు నార్మల్ రేట్లకే ఇస్తే మాకు లాభం ఏంటి?” అని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు. ఆఫర్ల పేరుతో సూపర్ K యాజమాన్యం తమను నమ్మించి గొంతు కోసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 15 లక్షల పెట్టుబడి.. నెలకు రూ. 50 వేలు కూడా రావట్లేదు: షాప్ యజమాని ఆవేదన
ఈ వివాదంపై సదరు షాప్ నిర్వాహకుడిని (ఫ్రాంచైజీ ఓనర్) వివరణ కోరగా, ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కస్టమర్ల కంటే తానే పెద్ద బాధితుడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “సూపర్ K బ్రాండ్ నమ్మి, అప్పులు తెచ్చి మరీ దాదాపు రూ. 15 లక్షల దాకా ఈ షాప్ ఏర్పాటు కోసం ఖర్చు పెట్టాను. కంపెనీ వారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాను. ఇప్పుడు కనీసం షాప్ మెయింటెనెన్స్, అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా వెళ్లడం లేదు. నెలకు కనీసం రూ. 50,000 కూడా ఆదాయం రావడం లేదు. ఒకపక్క పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరుగుతున్నాయి, మరోపక్క కంపెనీ పాలసీల వల్ల కస్టమర్లకు తక్కువ ధరలకు ఇవ్వలేక బ్రాండ్ ఇమేజ్ పాడవుతోంది. మాకు భారీగా లాస్ వస్తోంది” అని షాప్ యజమాని వాపోయారు.
పట్టించుకోని యాజమాన్యం.. చర్యలకు డిమాండ్
రూ. 15 లక్షలు పెట్టి రోడ్డున పడ్డామని స్థానిక యజమాని బాధపడుతుంటే, అటు మెంబర్‌షిప్ తీసుకున్న సామాన్య ప్రజలు సైతం మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. బ్రాండెడ్ బోర్డులు తగిలించి, క్యాష్ బ్యాక్ ఆఫర్లంటూ నమ్మించి స్థానిక వ్యాపారులను, ప్రజలను ముంచుతున్న ఇటువంటి ఫ్రాంచైజీ కంపెనీల మోసపూరిత విధానాలపై ఉన్నతాధికారులు స్పందించాలని, వినియోగదారుల ఫోరం మరియు సంబంధిత శాఖలు విచారణ జరిపి న్యాయం చేయాలని పోరుమామిళ్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.