ఘట్‌కేసర్, జూలై 26 (ప్రజావాణి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 276వ వారపు నిత్య పూలమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదులాబాద్ డివిజన్‌కు చెందిన కందకట్ల సందీప్ రెడ్డి హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కందకట్ల సందీప్ రెడ్డి మాట్లాడుతూ, గత 276 వారాలుగా ఎలాంటి విరామం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని జ్ఞానాన్ని సంపాదిస్తూ సమాజ అభివృద్ధికి తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, కె. వెంకట్ రెడ్డి, కె. నర్సింగ్ రావు, కె. సత్యం, ఈడబ్ల్యూఎస్ కాలనీ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బండారి రాందాస్, మీశాల రాజేష్ కుమార్, బి. సాయి కుమార్ గౌడ్, కె. బాలస్వామి, జి. కృష్ణ, ఎం.డి. అక్బర్, జి. అంజయ్య, బి. గణేష్ గౌడ్, సి. నిఖిల్, జె. అఖిల్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





