నీళ్ల దోపిడీని అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావును విమర్శించే హక్కు లేదు
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రశ్నల వర్షం
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 27
ధర్మారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్‌పై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు తెలంగాణ నీటిని తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కళ్లు, నోళ్లు మూసుకుని మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా ధారాదత్తం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉలుకని నిలదీశారు. నీళ్ల లెక్కలు అడుగుతున్న హరీశ్ రావుకు సమాధానం చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే నీటి వాటాలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
2025లో 299:512 నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జరిగిన తాత్కాలిక నీటి పంపిణీ ఒప్పందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. జనవరిలో టెండర్లు పిలిచి ఆగస్టులో జీవో నంబర్ 453 విడుదల చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ నిర్ణయాల వల్ల నల్లగొండ, పాలమూరు జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతున్నా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
2024 డిసెంబర్ 3న చంద్రబాబు నాయుడు 403, 405 జీవోలు జారీ చేసి హెన్రీ నీవా పనులు చేపట్టిన అంశాన్ని హరీశ్ రావు ప్రస్తావించారని, తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పనులను ఎందుకు వ్యతిరేకించలేదని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ఎండిపోతుంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు.
పాలమూరు ప్రాజెక్టుల పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ-3 పనులు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేస్తే 50 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చి పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారేదని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా మిగిలిన పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.
పల్నాడు స్కీమ్‌కు సంబంధించి జీవో నంబర్ 56ను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అయితే ఆ జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదన ఎక్కడైనా ఉందా అని హరీశ్ రావు ప్రశ్నించారని తెలిపారు. అలాంటి ప్రతిపాదన ఉంటే చూపించాలని డిమాండ్ చేశారన్నారు.
తెలంగాణ నీటి ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించి నీటి దోపిడీకి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్ర శూన్యమని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర నలుమూలలకు నీళ్లు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ అవగాహనారాహిత్యం, అసమర్థత, ఆంధ్ర నాయకులకు లొంగిపోయే ధోరణి కారణంగా తెలంగాణ మరోసారి కరువు ప్రాంతంగా మారే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ధర్మపురిలో అభివృద్ధిపై మంత్రి సమాధానం చెప్పాలి
ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభివృద్ధి పనులను పక్కనపెట్టి హరీశ్ రావుపై విమర్శలు చేయడం సరికాదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. తాను ధర్మారం మండలంతో కలిపి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశానని, అందులో పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ధర్మపురి నియోజకవర్గంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిపోయిందని ఆధారాలతో నిరూపించాలని, నిరూపించలేకపోతే బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా ధర్మారం మండలంలోనే వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 14 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో మోటార్లు కాలిపోయినా ఆరు నెలలు, ఏడాది గడిచినా మరమ్మతులు చేయించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
సొంత నియోజకవర్గంలోనే రైతుల పంటలు ఎండిపోతుంటే మంత్రి పట్టించుకోవడం లేదని, అవసరమైతే అందుబాటులో ఉన్న మోటార్లను తెప్పించి మరమ్మతులు చేయించి రైతులకు సాగునీరు అందించే చొరవ చూపాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల అవస్థలు
ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు, షెడ్లు లేక రైతులు ఎక్కడపడితే అక్కడ ధాన్యం అమ్ముకుంటూ నష్టపోతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
మూడు సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు ఏమిటో మంత్రి చెప్పాలని ప్రశ్నించారు. ఏ గ్రామానికి వెళ్లినా తాను చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తాయని, కానీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని నిలదీశారు.
కోటిలింగాల ప్రాంతాన్ని కోట్లాది రూపాయలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పని కూడా ప్రారంభించలేదని విమర్శించారు. యశ్వంతరావుపేట చెరువు సిల్ట్ తొలగింపు, బండ్ అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ముందుకు సాగడం లేదన్నారు. భీమన్న చెరువుకు రూ.15 కోట్లు మంజూరై, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించినప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
సాగునీటి పనులు వెంటనే పూర్తి చేయాలి
మానేరు కాలువ, బొమ్మనరెడ్డిపల్లి ఎక్స్టెన్షన్ కెనాల్, రైట్, లెఫ్ట్ కెనాల్స్‌తో పాటు కానంపల్లి భీమన్న చెరువు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. నంది మేడారం రిజర్వాయర్‌ను ఒక టీఎంసీ సామర్థ్యంతో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావం ఒకవైపు ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న నీటిని కూడా ఎత్తిపోసుకోలేకపోవడం వల్లే రైతులకు కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని కేటీఆర్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందని పేర్కొన్నారు.
గోదావరి జలాలు ఎవరి సొంతం కాదని, నాసిక్‌లో పుట్టి వివిధ ప్రాంతాల గుండా ప్రవహించే నదీ జలాలపై సంబంధిత ప్రాంతాల ప్రజలకు హక్కులు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఫాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మోహన్ రెడ్డి, రాసూరి శ్రీధర్, పుస్కురి రామారావు, రాంచందర్ గౌడ్, మూగల సత్యం, పత్తిపాక వెంకటేష్, గొస్కుల జలేందర్, ఆవుల సత్యం, వెంకట మాధవరావు, రియాజ్, వెంకటేష్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

