📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ17వ వార్డుపై కాంగ్రెస్ పార్టీ వివక్షాపూరిత వైఖరి.కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ ఆగ్రహం

17వ వార్డుపై కాంగ్రెస్ పార్టీ వివక్షాపూరిత వైఖరి.కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

*17వ వార్డుపై కాంగ్రెస్ పార్టీ వివక్షాపూరిత వైఖరి.కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ ఆగ్రహం*

అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డులకే అభివృద్ధి పనులా? బీజేపీ కౌన్సిలర్ గెలిచిన వార్డు కనిపించడం లేదా?

ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 21

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభివృద్ధి పనుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై బీజేపీ కౌన్సిలర్ పమిడి గీతాశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైన తనను రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకుని, తన వార్డులో అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు.17వ వార్డులో రహదారుల నిర్మాణానికి సంబంధించి గ్రాంట్లు విడుదలైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడం అధికార పార్టీ వివక్షకు నిదర్శనమని గీతాశ్రీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతుండగా, బీజేపీ కౌన్సిలర్‌గా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో మాత్రం పనులను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఈ విషయంలో బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.గతంలో అనేక కౌన్సిల్ సమావేశాల్లో తన వార్డులో నెలకొన్న సమస్యలను ప్రస్తావించి, రహదారుల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు, పాలకవర్గం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇంతటితో ఆగకుండా, ప్రజలు ఎన్నుకుని కౌన్సిలర్‌గా బాధ్యతలు అప్పగించిన తనను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో వ్యక్తిని 17వ వార్డు ఇంచార్జిగా నియమించి అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం కోసం సంప్రదించాలంటూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం అధికార పార్టీ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కాదని, సంబంధం లేని వ్యక్తికి వార్డు బాధ్యతలు అప్పగించడం ప్రజల తీర్పును అవమానించడమేనని స్పష్టం చేశారు.మున్సిపాలిటీలో 19 మంది కౌన్సిలర్ల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఒక్క కౌన్సిలర్ ప్రాతినిధ్యం ఉన్న బీజేపీని చూసి భయపడుతోందని గీతాశ్రీ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధికి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుందని హితవు పలికారు.ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఓడిపోయిన 22 వార్డులకు కూడా 22 మంది ఇంచార్జులను నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే ఆ పార్టీ నాయకులు ఇంచార్జుల వేట ప్రారంభించుకోవాలని చురకలంటించారు.రాజకీయ కక్షలు, పార్టీల మధ్య విభేదాలను పక్కనపెట్టి 17వ వార్డులో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పమిడి గీతాశ్రీ మున్సిపల్ పాలకవర్గాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.