*హత్య కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా*
*నల్లగొండ జిల్లా పోలీస్ సమగ్ర దర్యాప్తు తో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణతో హత్య కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్ష తప్పదని, నేరస్తులకు శిక్షలు పడేలా ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి, కోర్టులో పటిష్టమైన ఆధారాలు సమర్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. కేసు వివరాలు:
నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27-08-2025 రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో డీవీకే రోడ్డులోని ప్రతీక్ రెడ్డి మెమోరియల్ బాయ్స్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో నాంపల్లి మండలం,వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (40) అనే వ్యక్తి రాత్రి నిద్రించే స్థలం విషయంలో రమేష్‌కు, కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన షేక్ సిరాజ్ అలియాస్ సిల్లు (40) కు మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు షేక్ సిరాజ్, రమేష్ తలపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేశాడు. తేది 28-08-2025 ఉదయం మృతుడి బంధువులకు ఈ విషయం తెలియడంతో మృతుడి బావ బుషిపాక వెంకటయ్య నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ రాజశేఖర్ రెడ్డి, క్రైమ్ నంబర్ 238/2025గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1), ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం సెక్షన్ 3(2)(va) కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీ అత్యంత కీలకంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితుడిని గుర్తించి పట్టుకోవడంతో పాటు హత్య జరిగిన తీరును స్పష్టంగా నిర్ధారించారు. నిందితుడు రమేష్‌పై దాడి చేసిన విధానం సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమై ఉండటంతో, ఆ దృశ్యాలు సమగ్ర దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టు లో సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి నల్లగొండ సెషన్స్ కేసు నంబర్ 138/2026లో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మరియు రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి 20-11-2026 న తీర్పు వెలువరించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు షేక్ సిరాజ్ అలియాస్ సిల్లు (40) కు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) ప్రకారం హత్య నేరానికి జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం సెక్షన్ 3(2)(va) కింద కూడా జీవిత ఖైదుతో పాటు మరో రూ.5,000 జరిమానా విధించారు. ఈ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. రెండు జీవిత ఖైదు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నిందితుడికి డబుల్ జీవిత ఖైదుతో పాటు మొత్తం రూ.10,000 జరిమానా విధించబడింది.ఈ కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించిన నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, అప్పటి నల్లగొండ వన్ టౌన్ సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ జె. సైదులు పోలీస్ అధికారులుగా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఎస్. శోభారాణి, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్ల కృషిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

