విద్యార్థుల ప్రదర్శనలతో అలరించిన పాఠశాల స్థాయి సామాజిక శాస్త్ర మేళా
దండేపల్లి, నవంబర్ 21 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ద్వారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల స్థాయి సామాజిక శాస్త్ర మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
భూతాపం నివారణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ, ఓటు హక్కు వినియోగం, బ్యాంకింగ్ విధానాలు, విపత్తుల నివారణ, భూగర్భ జలాల పొదుపు వినియోగం, ఎల్నినో తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆయా అంశాలపై విద్యార్థులు వివరించిన తీరు ఉపాధ్యాయులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. చిన్న నర్సయ్య మాట్లాడుతూ, మేళాలో ఉత్తమంగా నిలిచిన ప్రదర్శనలను జిల్లా స్థాయి సామాజిక శాస్త్ర మేళాకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక అవగాహన, సృజనాత్మకత, విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గేడం దేవయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి అభినందించారు.

