మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాల్లో పొత్కపల్లి విద్యార్థుల ప్రతిభ
జిల్లా స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
ఓదెల: మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు–2026 పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి విద్యార్థులు ప్రతిభ చాటుకుని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ) ఆధ్వర్యంలో శనివారం ఓదెల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు–2026 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండల విద్యాధికారి వై. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విజ్ఞాన ప్రతిభను ప్రదర్శించారు.
ఈ పోటీల్లో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి పాఠశాలకు చెందిన ఆడెపు శ్రీనిత్య, మాచర్ల శ్రీకర్, గొడుగు అక్షయ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థుల విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
విజేత విద్యార్థులను మండల విద్యాధికారి వై. రమేష్, ఉపాధ్యాయులు అభినందించి, వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమృత కిషోర్, వెంకట్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కవీశ్వర్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
.

