*విట్టాపూర్‌లో ఉపాధి హామీ పనులకు శ్రీకారం*
*గ్రామీణ పేదలకు ఉపాధి కల్పనే లక్ష్యం.. పనులను ప్రారంభించిన సర్పంచ్ సింధె లింగురాం పటేల్*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో కుంటాల, నవంబర్ 16:-
నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పనులకు గ్రామ సర్పంచ్ సింధె లింగురాం పటేల్ శ్రీకారం చుట్టారు. గ్రామంలో కూలీలకు పనులు కల్పించి వారి ఆర్థిక పరిస్థితికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ-జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు, ఒక్కో కూలీకి రోజుకు రూ.307 వేతనం చెల్లించే విధానం అమల్లో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్ మాట్లాడుతూ.. మిట్టాపూర్ గ్రామంలో మొత్తం 301 మందికి జాబ్ కార్డులు ఉండగా, వారిలో 281 మంది జాబ్ కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రైతుల పొలాల్లో వ్యవసాయ పనులు కొనసాగుతుండటంతో ఉపాధి పనులకు కూలీల లభ్యత కొంత తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ, సోమవారం నిర్వహించిన పనులకు 40 మంది కూలీలు హాజరైనట్లు వివరించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు నిరంతరాయంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ సింధె లింగురాం పటేల్ పేర్కొన్నారు. గ్రామంలోని అర్హులైన కూలీలందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్, యు. లక్ష్మణ్, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ పెద్దలు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


