సినీనటుడు గిరిబాబు మృతికి వైయస్ జగన్ సంతాపం
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15
తాడేపల్లి
తెలుగు సినీ పరిశ్రమకు గిరిబాబు మరణం తీరని లోటు
ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోసిన గిరిబాబు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.
గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు, అభిమానులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

